Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

వైసీపీకి గుడ్ బై.. పవన్ సమక్షంలో జనసేనలో చేరిన యనమల కృష్ణుడు, నవీన్ నిశ్చల్

Pawan Kalyan welcomes Yanamala Krishnudu and Naveen Nischal into Janasena Party
Advertisement
  • జనసేన పార్టీలో చేరిన పలువురు వైసీపీ నేతలు
  • పవన్ కల్యాణ్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్న నేతలు
  • పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నేతలకు పవన్ సూచన
  • పవన్ పాలన, నిబద్ధతకు ఆకర్షితులై చేరామన్న నేతలు
Advertisement
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జనసేన పార్టీలోకి చేరికల పర్వం కొనసాగుతోంది. అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ బలోపేతంపై దృష్టి సారించిన జనసేన, తాజాగా వైసీపీకి గట్టి షాక్ ఇచ్చింది. పలు నియోజకవర్గాలకు చెందిన కీలక వైసీపీ నేతలతో పాటు, కాంగ్రెస్ నాయకురాలు ఒకరు శుక్రవారం జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సమక్షంలో పార్టీలో చేరారు.

తుని నియోజకవర్గానికి చెందిన వైసీపీ నేత యనమల కృష్ణుడు, హిందూపురం సీనియర్ నాయకుడు నవీన్ నిశ్చల్ వంటి ప్రముఖులు జనసేన తీర్థం పుచ్చుకున్నారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో పవన్ కల్యాణ్ వీరికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. జనసేన పార్టీ సిద్ధాంతాలు, ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రిగా పవన్ కల్యాణ్ పరిపాలనలో చూపుతున్న నిబద్ధత, చేపడుతున్న సంస్కరణలకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నట్లు ఈ సందర్భంగా నేతలు తెలిపారు.

వీరితో పాటు ఏలూరు డీసీసీబీ మాజీ ఛైర్మన్ పీవీఎల్ఎన్ నరసింహరాజు, కందుకూరు, సర్వేపల్లి, కనిగిరి నియోజకవర్గాల వైసీపీ పరిశీలకుడు మన్నెమాల సుకుమార్ రెడ్డి, కాంగ్రెస్ నాయకురాలు అయితాబత్తుల సుభాషిణి కూడా జనసేనలో చేరారు. తునికి చెందిన పొలినాటి శేషగిరిరావు, తణుకు నుంచి దిరిశాల కృష్ణ శ్రీనివాస్, శ్రీకాళహస్తికి చెందిన సత్రవాడ ప్రవీణ్, మిద్దెల హరి, ముమ్మడివరం మాజీ ఏఎంసీ ఛైర్మన్ కుడిపూడి శివన్నారాయణ, నరసరావుపేటకు చెందిన ఏలూరి ప్రసాద్ తదితరులు పవన్ కల్యాణ్ చేతుల మీదుగా పార్టీ కండువా కప్పుకున్నారు.

ఈ సందర్భంగా కొత్తగా చేరిన నాయకులను ఉద్దేశించి పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని సూచించారు. అందరినీ కలుపుకొని, సమష్టిగా పనిచేస్తూ పార్టీ ఉన్నతికి కృషి చేయాలని వారికి దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జనసేనలో చేరికలు ఊపందుకోవడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
Advertisement
Advertisement
Pawan Kalyan
Janasena Party
Yanamala Krishnudu
Naveen Nischal
YSRCP Leaders Join Janasena
Andhra Pradesh Politics

More Telugu News